
జనం న్యూస్ డిసెంబర్ 30 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇకపై ఎవరి పేర్లు, పరిచయాలు పనిచేయవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వెంటనే కొందరు “మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బెదిరింపులకు, రికమండేషన్లకు తన దగ్గర ఎలాంటి స్థానం లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు.సజ్జనార్ తనదైన స్టైల్లో మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చిన్న తప్పు కాదని, అది ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన నేరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు అనాధలవుతున్నాయని, అలాంటి ఘటనలను అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తుల గోప్యతను పోలీసులు గౌరవిస్తారని సజ్జనార్ చెప్పారు. వారి వ్యక్తిగత జీవితంలోకి చొరబడే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అయితే చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని, వాహనాన్ని పక్కన పెట్టించి కేసు నమోదు చేసి, నిర్ణీత తేదీన కోర్టులోనే పరిచయం అవుతామని హెచ్చరించారు.
ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా నమోదవుతాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే మందుబాబులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని తెలిపారు. మోతాదుకు మించి మద్యం సేవిస్తే స్టీరింగ్ పట్టకూడదని, అవసరమైతే క్యాబ్‌ను పిలవాలని సూచించారు. ఆ సమయంలో గూగుల్‌లో ‘క్యాబ్’ అని వెతకాలని, ‘లాయర్’ అని కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.సజ్జనార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఆయన తీసుకుంటున్న కఠిన వైఖరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, “నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?” అన్నా సరే, చట్టం ముందు అందరూ సమానమేనని సజ్జనార్ మరోసారి స్పష్టంచేశారు.