
జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రభుత్వం అందించే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాలల విద్యార్థులకు అందించే ప్రీమేట్రిక్ స్కాలర్షిప్ అంశంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఐదవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు 9, 10 వ తరగతులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో ఎస్సీ విద్యార్థులు 2617 మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 1196 మంది, 1819 మంది బీసీ విద్యార్థులకు గాను 859 మంది మాత్రమే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. అర్హులైన విద్యార్థులందరూ ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన రెవెన్యూ అధికారులు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. ఆయా మండలాల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడినీ నోడల్ అధికారిగా నియమించి విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు బ్యాంకు లేదా పోస్టల్ ఖాతాలు త్వరితగతిన పొందేలా సంబంధిత అధికారులు సహకరించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, ఆయా మండలాల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.