
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
చరిత్రను పరిశీలిస్తే దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు, వారు చేసిన ఉద్యమాలు, ఇతర పోరాటాల ఫలితాలను తెలుసుకోవచ్చని, వందేళ్ల వయసు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి ఏ విధంగా సేవ చేసిందో, ఏం సాధించిందో తెలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో నిర్వహించే సిపిఐ మహాసభల నిమిత్తం జిల్లా కార్యవర్గాన్ని, శ్రేణులను సమాయత్తం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. స్థానిక అమర్ భవన్లో జిల్లా సిపిఐ కార్యదర్శి ఒమ్మి రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వందలాదిగా వచ్చిన వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీషు పాలనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని ముందు నిలిచింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. ప్రస్తుతం వందేళ్లు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సిపిఐ పట్ల ఎవరు అవాకులు చవాకులు మాట్లాడినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీలు దేశానికి ఏం సేవ చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కేవలం కార్పొరేట్ రంగానికి తొత్తులుగా మారి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తమ ఊపిరి ఉన్నంత వరకు ఎర్రజెండా పట్టుకున్న ప్రతీ కార్యకర్త దేశాన్ని రక్షించుకునేందుకు పాటుపడతాడని తెలిపారు.వందేళ్ల చరిత్రలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి వేలాది ఎకరాలను పేదలకు పంచడం జరిగిందన్నారు. అధికారం లేకపోయినా హక్కుల కోసం పోరాడే వారికి అండగా కమ్యూనిస్టులు ఉన్నారని, నోరు లేని ఉద్యమకారులకు నోరుగా మారిందని అన్నారు. పదవీ కాంక్షలు కమ్యూనిస్టులకు ఉండవని, గతంలో ఒక కార్పొరేట్ పెద్ద పార్టీకి రూ. 50 కోట్లు విరాళంగా ఇస్తే తిరిగి పంపించిన ఘనత సిపిఐకి ఉందని గుర్తు చేశారు. కూలి చేసుకునే వ్యక్తి ఇచ్చే రూపాయి అయినా పార్టీకి పెద్ద వరంగా భావిస్తామన్నారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు.18న ఖమ్మం మహాసభలను విజయవంతం చేయండి ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సిపిఐ మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దోపిడీ లేని సమాజం కోసం పాటుపడుతున్న సిపిఐని, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు మరియు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.వై.ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.