
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ జనవరి 5న భోగాపురం మండలం, ముంజేరు గ్రామం దీక్షా శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ముంజేరు గ్రామంలో డ్రైనేజీ కాలువ పనుల సందర్భంగా జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తెలుసని, గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుపై భోగాపురం పోలీస్ స్టేషన్ లో 20.11.2025న ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారితో ఈ కేసు దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామని బాధితులకు వివరించారు. చట్టంలో నేరాలు, సెక్షన్లను బట్టి శిక్షలు ఉంటాయని, ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఈ కేసులో చట్ట ప్రకారం ఇప్పటికే 34 మంది ముద్దాయిలకు అరెస్ట్ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని, త్వరలోనే కోర్టులో అభియోగ పత్రం (ఛార్జ్ షీట్) దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.గ్రామంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించిన ఎస్పీ, త్వరలోనే న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తూ దీక్షా శిబిరాన్ని వెంటనే ఖాళీ చేయాలని కోరారు. ముంజేరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడవద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా 100/112 కు సమాచారం అందించాలని కోరారు.ముంజేరు గ్రామ సందర్శన సమయంలో భోగాపురం సిఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్ఐలు వి.పాపారావు, సూర్య కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు