
జనం న్యూస్ జనవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పండగల్లో అతిపెద్దపండగ గా చెప్పుకునే సంక్రాంతి హడావిడి సర్కార్ స్కూల్లల్లో నాలుగురోజులు ముందుగానే వచ్చేసింది.కొత్తసంవత్సరం తొలిరోజుల్లో పాడిపంటలు పుష్కలంగా ఇంటిళ్లపాధి ఆనందాలతో భోగిమంటలతో,పిండివంటలతో,ఆడపిల్లలు అలంకరణలతో,అల్లుళ్ల హడావుడితో హాయిగా చేసుకునే సాంప్రదాయ బద్ధమైన సంక్రాంతిశోభను సర్కార్ బడులల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.దీనిలో భాగంగా కాట్రేనికోన మండలం పెనుమల్లె-లక్ష్మీవాడ గుత్తుల రామమూర్తి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిపి విద్యార్థులు,గ్రామ పెద్దలసమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.సంక్రాంతి పండుగలో ప్రతిఅంశాన్ని విద్యార్థులు క్రోడీకరించి ఆకర్షణీయమైన వేషధారణతో గ్రామపెద్దలను, విద్యార్థులు తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు.ముఖ్యంగా సంక్రాంతి పండుగలో ఇళ్ళముందు తారసపడే చక్కనైన రంగవల్లికలు,గొబ్బెమ్మలు, డుడూ బసవన్న హొయలు, పాడిపంటలు విశిష్టత,పిండివంటల రుచులు,దేవుళ్ళను కొలిచే ప్రభలు, తీన్మార్ డ్యాన్సులు విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపించారు.
