
జనం న్యూస్ - జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్ -
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక రంగాల వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన జీపు జాత ప్రదర్శన, సభలను విజయవంతం చేస్తూ దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ కె బషీర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 12వ తేదీ వరకు చేపట్టిన జీపు జాత శుక్రవారం నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ కె బషీర్ మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను రద్దుచేసి 4 కోడ్లు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి తీసుకువచ్చిన వి బి రామ్ జి చట్టాన్ని, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ తో జీపుజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘం సంయుక్తంగా దశలవారీగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆనంద్ పాల్, రోశయ్య, గోవింద్, నందికొండ మున్సిపాలిటీ నుండి శివ, తాహెర్, వ్యవసాయ కార్మిక సంఘం నుండి రవి నాయక్, కృష్ణారెడ్డి, కొండలు తదితరులు పాల్గొన్నారు.