
జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, వారి యొక్క ఆశయాలను మరియు ఆలోచనలను నేటి యువత ఆచరించాలని ఏబీవీపీ నిర్వహించిన 163 జయంతి ఉత్సవాలలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్గాన్ని సోమశేఖర్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా యువ జాగృతి జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర పేరుతో ఈరోజు కార్యక్రమం శ్రీ చైతన్య కాలేజీలో నిర్వహించారు. స్వామి వివేకానంద జీవితం, ఆచరించిన విలువలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని పెంపొందిస్తుందని, విలువలతో కూడిన విద్య ద్వారానే ఉత్తమ పౌరులుగా తయారవుతారని, దేశానికి సేవ చేయాలంటే పెద్ద పదవులు అవసరం లేదని, సరైన ఆలోచన, ధైర్యం, బాధ్యత ఉంటే ప్రతి యువకుడూ దేశ నిర్మాణంలో భాగస్వామి కావచ్చని పేర్కొన్నారు.నేటి యువత రేపటి నాయకులు మాత్రమే కాకుండా, ఈ రోజే దేశాన్ని మార్చే శక్తి అని స్పష్టం చేశారు.టెక్నాలజీ, ఉపాధి, పర్యావరణం, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం వినూత్న ఆలోచనల ద్వారానే సాధ్యమని తెలిపారు. వినూత్నత అనేది కేవలం స్టార్టప్‌లు లేదా యాప్‌లకే పరిమితం కాదని, సమాజ సమస్యను గుర్తించి బాధ్యతతో పరిష్కారం కనుగొనడమే నిజమైన వినూత్నత అని అన్నారు. నైతికత, దేశభక్తి కలిసిన వినూత్నతే జాతి నిర్మాణానికి బలమని పేర్కొన్నారు. ఆవిధంగా స్వామి వివేకానంద కలలను సాకారందిశగా వికాసిత్ భరత్ 2047 వైపు మన పయనం వుండాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏబీ విపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేంద్రబాబు, నగర కార్యదర్శి రేష్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీపతి , కళాశాల ప్రిన్సిపాల్ మల్లిక, రాజేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు.
