
జనం న్యూస్ 14 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మూడోసారి ఆడపిల్ల పుట్టడమే కారణం..రూ. 3 లక్షల విక్రయించిన తల్లిదండ్రులు..అంగన్వాడీ టీచర్ ద్వారా వ్యవహారం వెలుగులోకి..కేసు నమోదు చేసిన షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్. పాత్రధారులు సూత్రధారులు ఎవరో.. పోలీసుల దర్యాప్తు షాద్ నగర్ లో మరో సంచలనం. మూడో సంతానంగా కూడా ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా తల్లిదండ్రులు ఏకంగా ఓ పసికందును అమ్మకానికి పెట్టారు.. ఓ ప్రబుద్ధుడు ఆ పసికందుకు ఖరీదు కట్టి రూ.3 లక్షలకు కొనుగోలు చేశాడు.. అంగన్వాడీ టీచర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆడ శిశువును ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే ఫరూక్ నగర్ మండలం లాల్ సింగ్ తండాకు చెందిన రేణుక, వినోద్ దంపతులకు గత నవంబర్ 9 వ తేదీన హైదరాబాద్ జజ్గిఖానాలో ఆడ శిశువుకు జన్మించింది. ఇంతకుముందే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి కూడా మగపిల్లాడు పుడతాడు అనుకుంటే ఆడపిల్ల పుట్టింది. దీనితో ఆడపిల్లను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదు కట్టారు. కొత్తూరు మండలం వేముల నర్వ గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి ఆ పసికుందును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. రూ. మూడు లక్షలకు పాపను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ప్రతి నెల పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్ చింటు అసలు సంగతి గ్రహించి ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు పోలీసులను సంప్రదించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ కు ఐసిడిఎస్ అధికారిని ఉదయ సంబంధిత అంగన్వాడి సిబ్బందితో పాటు సూపర్వైజర్ విజయలక్ష్మి చేరుకొని అసలు విషయాలను పోలీసులకు తెలిపారు. పట్టణ సీఐ విజయకుమార్ రంగంలోకి దిగి విచారణ చేయగా పసికందును విక్రయించిన మాట వాస్తవమేనని తేలింది. దీనితో గోవిందును అదుపులోకి తీసుకొని పసికందును స్వాధీనం చేసుకొని ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు. ఐసిడిఎస్ అధికారులు పసికందులు శిశు విహార్ కు తరలించారు. కేసు ఇంకా విచారణలో ఉందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సిఐ విజయ్ కుమార్ తెలిపారు. పాత్రధారులు సూత్రధారులు ఎవరు..పసికందు విక్రయం వ్యవహారం షాద్ నగర్ నియోజకవర్గంలో సంచలనంగా మారింది. వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు కనిపెడతావని పోలీసులు చెబుతున్నారు. గతంలో చిల్డ్రన్స్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ పేరిట మూడు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో పసికందుల విక్రయాలు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి విధితమే. తాజాగా ఈ వ్యవహారం మళ్లీ ఈ ప్రాంతంలో తెరమీదకు రావడంతో మరోసారి గిరిజనులలో ఈ అంశం బాధను రేకెత్తిస్తుంది. పసికందులు విక్రయించడం వెనుక ఎవరు ఉన్నారు? ఎప్పటినుండి ఈ దందా కొనసాగుతుంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంతమంది చిన్నారులను ఈ ప్రాంతంలో విక్రయించారు తేలాల్సి ఉంది.అమ్మినవారు వీలైతే కొన్నవారు ఎవరు వారి వివరాలను కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. త్వరలోనే వీరి వివరాలు కూడా మీడియా ముందుకు వస్తాయి. ఇంతమంది ముఠాగా ఏర్పడి పసిపిల్లల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరగడం వెనుక గుట్టురట్టు చేస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు..