
దిశా' సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్
జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్,
ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పనుల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. ఎం.పీ లాడ్స్ నిధులను మంజూరు చేసేందుకు పలువురు కమీషన్ లు డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ ధోరణిని మార్చుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని, అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఆర్.ఓ.బీ, ఆర్.యూ.బీ పనులను త్వరితగతిన జరిపించాలని, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలన్నారు.
పీ.ఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని, ఈ పథకం అమలులో ద్వితీయ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని సూచించారు.
కాగా, ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు చేరుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దిశా కమిటీ సభ్యులు కోరగా, సీ.జీ.జీ ఆధ్వర్యంలో ఇసుక తొలగింపు ప్రక్రియను త్వరలోనే జరిపిస్తామని, తద్వారా రైతులకు తోడ్పాటును అందించడమే కాకుండా జిల్లా యంత్రాంగానికి నిధులు కూడా సమకూరుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇదిలాఉండగా, ఆయా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుండి మంజూరీలు లభించిన నేపధ్యంలో నిర్మాణ పనులు జరిపించే విషయంలో జాప్యం జరగకుండా సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడైనా స్థల సమస్య నెలకొని ఉంటే తమ దృష్టికి తేవాలని అన్నారు. ఇప్పటికే పలుచోట్ల ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల కోసం స్థలాలను కూడా కేటాయించడం జరిగిందని, నిధులు అందుబాటులో ఉన్నందున వెంటనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించబడిన స్థలాలు కబ్జాకు గురైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు లబ్ది పొందేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చొరవ చూపుతున్నామని, ఫలితంగా 851 మందికి మంజూరీలు కూడా లభించాయని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం గురించి సామాజిక, ప్రసార మాదమాల ద్వారా గ్రామ గ్రామాన మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేలా పంచాయతీ కార్యదర్శులు మొదలుకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలన్నారు. బాధిత కుటుంబాలకు ఒకే విడతలో 20వేల రూపాయలు వారి ఖాతాలలో నేరుగా జమ అవుతాయని, కుటుంబ పోషణ చూసే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకు ఇది ఎంతో ఆదరువును అందిస్తుందని అన్నారు.అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పోరేషన్ కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని, మడిగెలను సబ్ లీజ్ కు ఇచ్చి వేలాది రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు. దీనిపై నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ వివరణ ఇస్తూ, ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపామని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, అద్దె పెంపు, లీజు రద్దు ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. కాగా, ఫులాంగ్ వాగు నిర్వహణ గురించి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎక్కడికక్కడ కబ్జాలు జరుగుతున్నాయని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. కబ్జాదారులపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని ఎం.పీ అర్వింద్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, దిశా కమిటీ ఆశన్న, లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
