
జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2024 నవంబర్ మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ (20 ఏళ్లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 3,000/- జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని జనవరి 20న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.కేసు వివరాలు:బొబ్బిలి మండలం, గొల్లపల్లి గ్రామంలో ఒక మైనరు బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుకొనుటకు రోజూ బొబ్బిలి వెళ్లి వస్తుండేది. గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ ఆ బాలికను ప్రేమ పేరుతో వెంటపడి, తనను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి మోసం చేశాడు. ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై బొబ్బిలి ఎస్ఐ ఆర్.రమేష్ 24.11.2024న పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు కోర్టు తీర్పు:నిందితుడు సింగారపు అజయ్ పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగారం మరియు రూ. 3,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ కేసులో పోలీసుల తరపున పోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎస్.రామమూర్తి నాయుడు వాదనలు వినిపించారు.పోలీసు అధికారులకు అభినందనలు:నిందితుడికి శిక్ష పడే విధంగా సమర్థవంతంగా పనిచేసిన అప్పటి బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఆర్.రమేష్, హెచ్‌సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు హెడ్ కానిస్టేబులు ఎం.మన్మధరావు, స్పెషల్ పిపి ఎస్.రామమూర్తి నాయుడులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
గడిచిన 6 నెలల్లో 13 పోక్సో కేసులలో నిందితులకు శిక్షలు విధించడం జరిగిందని, పోక్సో కేసుల శిక్షల అమలులో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తీవ్రంగా హెచ్చరించారు.