
కేజీబీవీ, మోడల్ స్కూల్స్ నిర్వాహకులకు కలెక్టర్ హితవు..
జనంన్యూస్. 22.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్.
కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లో చదువుకుంటున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ, వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి నిర్వాహకులకు హితవు పలికారు. విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్ళను సాధికారతతో దీటుగా ఎదుర్కోవడం, బాలికల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం తదితర అంశాలపై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ కేర్ టేకర్లు, వార్డెన్లకు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కపిల హోటల్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ నెల 19 నుండి 23 వరకు ఐదు రోజుల పాటు ఆయా అంశాలలో అందిస్తున్న శిక్షణ గురించి విద్యా శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. క్షేత్రస్థాయిలో కేజీబీవీ బాలికలకు ఎదురైన పలు సున్నితమైన సమస్యలను పరిష్కరిస్తూ, వారిని మానసికంగా కుంగుబాటుకు గురి కాకుండా తీసుకున్న చర్యల గురించి ఈ సందర్భంగా పలువురు స్పెషల్ ఆఫీసర్లు ఆయా ఉదంతాల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు బాలికల సామాజిక, మానసిక వృద్ధికి వికాస కేంద్రాలుగా దోహదపడాలని, కేవలం చదువులోనే కాకుండా అన్ని అంశాలలో విద్యార్థినులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని నిర్వాహకులకు ఉద్బోధించారు. బాలికలు అనేక సమస్యలతో సతమతం అవుతారని, వారి పట్ల ఆప్యాయతను చూపితే తమ ఇబ్బందులను నిర్భయంగా చెప్పుకుంటారని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. విద్యార్థినుల మానసిక స్థితి, ప్రవర్తనను గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. బాలికలపై లైంగికపరమైన దాడులకు సంబంధించిన కేసులలో ఎక్కువగా దగ్గరి సంబంధీకులే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నందున, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి ప్రతి బాలికకు పరిపూర్ణమైన అవగాహన కల్పించాలన్నారు. సానుకూల దృక్పథంతో వారు ముందుకు సాగేలా విద్యార్ధి దశ నుండి వారి ఆలోచనలను తీర్చిదిద్దుకునేలా కృషి చేయాలన్నారు. నేటి సమాజంలో బాలురు, బాలికలు అనే అంతరం చూపకుండా నైతికత, సత్ప్రవర్తన విషయంలో అమ్మాయిల తరహాలోనే అబ్బాయిలకు కూడా తల్లిదండ్రులు సమాన స్థాయిలో ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపుతానని, ఎలాంటి వసతులు కావాల్సి ఉన్నా తన దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. శిక్షణ తరగతులలో నేర్చుకున్న అంశాలు కేజీబీవీ, మోడల్ స్కూళ్ళ నిర్వహణను మెరుగుపరుస్తూ, బాలికల అభ్యున్నతికి దోహదపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జీసీడీఓలు భాగ్యలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్స్ కేర్ టేకర్లు, వార్డెన్లు పాల్గొన్నారు.
