
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నిరుపేద కుటుంబం వీధిన పడింది. మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మురారి శ్యామల అనే మహిళకు చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది.బాధితురాలు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లోని సామాగ్రి, నిత్యావసరాలు, ఇతర విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు శ్యామల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.నిరుపేదరాలైన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.