
జనం న్యూస్ 26 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతోందని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. ఆదివారం భీమిలి నియోజకవర్గం, సింహాచలం 98వ వార్డులో వార్డు ఇంచార్జ్ కొలుసు ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన 'ఆత్మీయ సమావేశం'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు.ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:కారుచౌకగా భూముల కేటాయింపు: భీమిలి తీర ప్రాంతంలో అత్యంత ఖరీదైన భూములను కేవలం 99 పైసలకే ఎకరం చొప్పున రియల్ ఎస్టేట్ దారులకు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఉపాధి పేరుతో జీవోలు ఇచ్చి, తీరా ప్రధాన నగరాల్లోని భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు.ఎంపీ ఆక్రమణలపై ప్రశ్నలు: విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు తన సంస్థకు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడాన్ని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అసలు అన్ని ఎకరాల భూమి వారి స్వాధీనంలోకి ఎలా వచ్చింది? అది ఏ రకమైన ఆక్రమణో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యకర్తలకు భరోసా - పార్టీ బలోపేతం: కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి వార్డులో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఫిబ్రవరి 1న విస్తృత స్థాయి సమావేశం: ఫిబ్రవరి 1వ తేదీన భీమిలి నియోజకవర్గ పరిధిలోని జి వి ఏం సీ వార్డుల 'విస్తృత స్థాయి సమావేశం' ఎండాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుందని, ఈ సమావేశానికి వార్డు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కర్రి అప్పలస్వామి, లంక సత్తిబాబు, విష్ణు, జి. మోహన్ రెడ్డి, పైడిరాజు, మహేష్, ఎస్. కృష్ణ, అప్పలరాజు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.