
జనం న్యూస్ 28 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వైద్యం–యోగ శిబిరం అత్యంత విజయవంతమైంది. తెలంగాణ ప్రభుత్వ యోగాభ్యాసన పరిషత్, ఆయుష్ శాఖ మరియు కొనిజేటి రోశయ్య నేచర్ క్యూర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ప్రకృతి వైద్యం మరియు యోగాపై విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిబిరం సాగింది.
ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను ప్రకృతి వైద్యం ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. మట్టి చికిత్స, జల వైద్యం, థెరప్యూటిక్ యోగా, ఆక్యుపంక్చర్ వంటి పద్ధతుల ద్వారా శరీరానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. సరైన ఆహారపు అలవాట్లు, ప్రకృతి సిద్ధమైన చికిత్సలు అనేక మొండి వ్యాధులకు పరిష్కారం చూపుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ మందిర్ ఇంచార్జ్ డాక్టర్ సులేఖ, జూనియర్ వైద్యులు డాక్టర్లు వైష్ణవి, ప్రణీత, నిశితారెడ్డి, భావన, అమిత, ఆదర్శ, శ్రావణి, హారిక మరియు డి.ఓ. వినోద్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
