
జనం న్యూస్:జనవరి 29 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామంలో గురువారం ఉదయం ఒక ట్రాక్టర్ ప్రమాదవశాత్తు వాగులో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.గ్రామంలో పనులకు వెళ్లే కూలీల కోసం నిలిపి ఉంచిన ట్రాక్టర్ వద్ద డ్రైవర్ లేకపోవడంతో, అకస్మాత్తుగా వాగు వైపు జారిపడి ప్రవహిస్తున్న నీటిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటన సమయంలో ట్రాక్టర్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ వాగులో పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు.ప్రమాద వార్త తెలుసుకున్న గ్రామస్తులు కొంతసేపు ఆందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ అపాయం జరగలేదని తెలిసిన తరువాత ఊపిరి పీల్చుకున్నారు. వాగు వద్ద రక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.