
జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో సతివాడ గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఫిబ్రవరి 5న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, విద్యార్థులతో మమేకమయ్యారు. క్షేత్ర స్థాయిలోని విద్యార్థుల్లోగల క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నెల్లిమర్ల పోలీసుల ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ - క్రీడలు విద్యార్థుల ఎదుగుదలకు సహాయపడతాయన్నారు. క్రీడల్లో రూల్స్ అండ్ రెగ్యులేషనులు ఉన్నట్లే సమాజంలో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి నిర్వహించాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలు ఆడితే ఏవిధంగా తప్పు చేసిన వారమవుతామో, చట్టాన్ని గౌరవించని వారు, ఉల్లంఘించిన వారు జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కావున, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి ప్రతీకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ, విజయాలను సొంతం చేసుకోవాలన్నారు. గేమ్స్ లో ఒకసారి అపజయం ఎదురైనా వాటి నుండి గుణపాఠాలను నేర్చుకొంటూ విజయం కోసం ఏవిధంగా కలిసికట్టుగా ప్రయత్నిస్తామో, అదే క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తూ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, విజయం సాధించాలన్నారు.దేశ భవిష్యత్తు అంతా యువతపైనే ఉందన్నారు. మన మంచి కోసం తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినాలని, చెడు స్నేహాలకు స్వస్తి పలికాలన్నారు. మంచి భవిష్యత్తును నిర్ణయించేది చదువేనన్న విషయాన్ని విద్యార్థులు ముందుగా గుర్తించాలన్నారు. ఆత్మ విశ్వాసంతో, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రలోభాలకు, సోషల్ మీడియాకు అలవాటు పడడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. సాంకేతికత నేడు ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉందని, దీనిని సక్రమంగా వినియోగించుకొంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అలాకాకుండా, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్విట్టరు వంటి సోషల్ మీడియా మాధ్యమాలకు అలవాటు పడితే లక్ష్యం దెబ్బతింటుందన్నారు.
పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి, కూలి పనులు చేసుకొని, వారి అవసరాలను తగ్గించుకొని, చదివిస్తుంటే, మీరు ప్రక్కదారి పట్టడం సరికాదన్నారు. కావున, ప్రతీ విద్యార్థి వారి తల్లిదండ్రుల శ్రమను గుర్తించి, ఉన్నతంగా, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. చదువుకొనే వయస్సులో ఆకతాయిల మాటలను నమ్మవద్దని, వారు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. విద్యార్థినులకు తప్పనిసరిగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పటికే చాలా స్కూల్స్ ను మహిళా సంరక్షణ పోలీసులు, శక్తి టీమ్స్, మహిళా కానిస్టేబుళ్ళు సందర్శించి, అవగాహన కల్పిస్తున్నామన్నారు. అమ్మాయిలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా, ఈవ్ టీజింగుకు గురైనా డయల్ 100 లేదా 112కు ఫోను చేయాలన్నారు. ప్రతీ మహిళ ఫోనులోను శక్తి (ఎస్ ఓ ఎస్) యాప్ ఉండాలన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, డాన్స్, ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో మీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలన్నారు. అదే విధంగా విద్యార్థులు గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. అనంతరం, ఆయన రిబ్బను కట్ చేసి, టాస్ వేసి, పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 30 క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి.ఈ కార్యక్రమంలో భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, ఎస్బీ సీఐ ఏ.వి. లీలారావు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్, డెంకాడ ఎస్ఐ ఏ. సన్యాసి నాయుడు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.