
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
దేశభక్తి, తీరప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటే ధ్యేయంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్ఎఫ్) రెండు బృందాలుగా ఏర్పడి దేశంలోని తీరప్రాంతం వెంబడి సైక్లథాన్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ ఫిబ్రవరి 6న తెలిపారు. వీటిలో ఒక బృందం నేడు జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రవేశించడంతో జిల్లా ఎస్పీ దామోదర్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ - దేశ భద్రతా బలగాలైన సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 'వందేమాతరం కోస్టల్ సైక్లథాన్-2026' కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది, అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి జనవరి 28న పశ్చిమ బెంగాల్, గుజరాత్ లో బయలుదేరాయన్నారు. ఈ రెండు బృందాలు ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చిన్ చేరుకోవడంతో సైక్లథాన్ ముగుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ నుండి బయలుదేరిన బృందం నేడు భోగాపురం చేరుకోవడంతో వారికి స్వాగతం పలికారు.తీరప్రాంతం గుండా శత్రువులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున, దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా కేంద్ర బలగాలకు, మెరైన్ మరియు స్థానిక పోలీసులకు పౌరులందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. తీర ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద పడవలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు, యువతకు దామోదర్ పిలుపునిచ్చారు. అనంతరం సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జిల్లా ఎస్పీకి మెమెంటో అందజేశారు.
వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాల మధ్య ఎస్పీ జెండా ఊపి ఈ సైకిల్ ర్యాలీని భోగాపురంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్బీ సిఐ లీలారావు, సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మహాపాత్ర, ఎస్ఐ పాపారావు మరియు ఇతర పోలీసు అధికారులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.