
జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో
అంబేద్కర్ యువజన సంఘం, బహుజన నాయకుల ఆధ్వర్యంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ సతీమణి రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా రామాబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బహుజన నాయకులు మాట్లాడుతూ—రామాబాయి తన జీవితాన్ని త్యాగం చేసి డా. బీ.ఆర్. అంబేద్కర్ను విదేశాల్లో చదివించిందని, తన పిల్లల ఆరోగ్యం బాగోలేకపోయినా అంబేద్కర్ విద్య కోసం అన్నింటినీ సహించిందని తెలిపారు. ఆమె చేసిన త్యాగాల ఫలితంగా అంబేద్కర్ చదువుకొని భారత రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు.ఈ రాజ్యాంగం వల్ల భారతదేశంలో బడుగు, బలహీన వర్గాలే కాకుండా ప్రతి పౌరుడు విద్య, స్వేచ్ఛ, హక్కులు పొందగలుగుతున్నాడని వారు అన్నారు. రామాబాయి తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయురాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాజు, బహుజన నాయకులు రాజేష్ రక్షక్, ముత్తేన్న, స్వాతి అనిల్, శేఖర్, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్, వడ్ల నరేష్, గంగాధర్, శోభన్, న్యాత రవి, రాజేశ్వర్, పౌలింగ్ తదితరులు పాల్గొన్నారు