
జనం న్యూస్ ఫిబ్రవరి 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ నాయకుడు వి. రవీందర్ రెడ్డి 36 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాలనీ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫలితం, ఐక్యతతో కూడిన పాలనకు నాంది పలికినట్టుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
విజయం అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అభివృద్ధి వ్యక్తిగత ప్రయత్నాలతో సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ఐక్య కార్యాచరణ అత్యవసరం అని పేర్కొన్నారు.
కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏ ఒక్క వ్యక్తికి లేదా వర్గానికి చెందినది కాదని, కాలనీలో నివసించే ప్రతి కుటుంబానికి, ప్రతి అపార్ట్మెంట్కు చెందిన ప్రజాస్వామ్య వేదిక అని ఆయన స్పష్టం చేశారు. కాలనీ ఐక్యత, పారదర్శక పాలన, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాల స్వీకరణ అనే మౌలిక సూత్రాలతో ముందుకు సాగాలనే దృఢ సంకల్పంతో తమ బృందం ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు.
ప్రతి అపార్ట్మెంట్, ప్రతి వ్యక్తిగత ఇంటి ప్రతినిధుల అభిప్రాయాలకు తగిన గౌరవం ఇస్తూ, అందరి భాగస్వామ్యంతో పాలన సాగించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కాలనీలో నిత్యం ఎదురవుతున్న డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, భద్రతా లోపాలు, పచ్చదనం పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి కీలక అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
సమస్యలపై మాటలకే పరిమితం కాకుండా, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. కాలనీ సమగ్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి నివాసితుడు ఐక్యతతో ముందుకు సాగాలని, తమ బృందానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
కౌసల్య కాలనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజల తీర్పుతో వచ్చిన ఈ విజయం, అభివృద్ధి దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.