
జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలలోని గట్టు, మాచర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా సోమవారం కలాజాత బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు సమాజానికి శాపమని, ఇవి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన ఆచారమని నేటి కలాజాత కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలాజాత బృందం సభ్యులు నాటకాలు, పాటలు, సంభాషణల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, విద్యా, సామాజిక సమస్యలను ప్రజలకు స్పష్టంగా వివరించారు. బాలికల విద్య ప్రాముఖ్యత, చట్ట ప్రకారం బాల్య వివాహం నేరమని, దీనికి శిక్షలు ఉన్నాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాల సంరక్షణ అధికారి శ్రీ నరసింహ మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ఎక్కడైనా బాల్య వివాహ సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ కౌన్సిలర్ సురేష్, సర్పంచు వజ్రమ్మ, పంచాయతీ కార్యదర్శి ముని నాయక్, బల్గేరా సర్పంచు డేవిడ్ మరియు పంచాయతీ కార్యదర్శి సురేష్, ఇంచార్జ్ హెడ్ మాస్టర్ రఘు మరియు ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ శివలీల, ఉమెన్ హబ్ సిబ్బంది సరోజా, అంగనివాడి టీచర్లు, ఆషా వర్కర్లు మరియు స్థానిక ప్రజలు, యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.