
వైరల్ అయితేనే కదిలే పాలన!
అధికారుల బాధ్యతారాహిత్య ప్రవర్తనకు కందేనకుంట గట్టి సాక్ష్యం
(గంగదరి పూర్ణచందర్ గౌడ్ జనం న్యూస్ రిపోర్టర్ )
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కందెనకుంట ఘటనలో కులం దుర్మార్గం అయితే.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరింత దారుణం. అన్నీ తెలిసి… అంతా చూసి… అయినా పట్టించుకోని పాలన ఇది. ఒక మనిషి అంత్యక్రియలు గౌరవంగా జరగకపోతే.. అది వ్యవస్థ వైఫల్యానికి తుది సాక్ష్యం. కానీ ఇక్కడ ఆ వైఫల్యాన్ని కూడా అధికారులు నిర్లజ్జగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కందెనకుంట గ్రామంలో ఎదుల రాజేశం మృతి చెందిన సందర్భంలో జరిగిన అమానుష ఘటన అధికార యంత్రాంగాన్ని నిలదీస్తోంది. గ్రామంలో “ఎదుల రాజేశం ఇంటికి ఎవ్వరూ వెళ్లకూడదు” అంటూ అక్రమ హుకుం జారీ అవుతున్నా.. అధికారులు మౌనంగా ఉన్నారు. పాడెను మోయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా, అధికారులు కళ్లుండి కబోదులుగా మారారు. చిన్నారి అంత్యక్రియల బాధ్యత మోసినా.. వారి మానవత్వం కదలలేదు. ఇదే అసలు అభియోగం. చూడలేదు కాదు… చూసి కూడా పట్టించుకోలేదు. తెలియలేదు కాదు… తెలిసి కూడా చర్యలు తీసుకోలేదు. గ్రామంలో సామాజిక ఆంక్షలు అమలవుతున్నాయి.అంత్యక్రియలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఊరు మొత్తం భయంతో నిశ్శబ్దంగా ఉంది. ఇవి అన్నీ తెలిసినా.. గ్రామ కార్యదర్శి స్పందించలేదు. పోలీసులు కదలలేదు.
రెవెన్యూ యంత్రాంగం మౌనంగా ఉంది.కానీ ఈ ఘటన ప్రసారమాధ్యమాల్లో వైరల్ అయిన వెంటనే హడావుడి మొదలైంది. అధికారుల మీద నిందలు పడతాయన్న భయంతో ఫిర్యాదులు, కేసులు, “విచారణ”ల పేరుతో హడావుడి జరిగింది. ఇది న్యాయ పరిరక్షణ కాదు.. స్వీయ రక్షణ. వార్త వైరల్ అయితేనే స్పందించే అధికారులు.. ప్రజల కోసం కాదు, తమ కోసం పనిచేస్తున్నారు. ఇది పాలన కాదు. ఇది బాధ్యతారాహిత్యపు ప్రదర్శన. ఇక్కడ ప్రశ్న కుల వివక్షపై మాత్రమే కాదు. ఇక్కడ ప్రశ్న అధికారుల కనీస బాధ్యతపై. ఒక గ్రామంలో అక్రమ ఆజ్ఞలు అమలవుతుంటే.. ముందే ఎందుకు జోక్యం చేసుకోలేదు?
అంత్యక్రియల సమయంలో ఎందుకు సహకారం అందించలేదు? వైరల్ కాకముందు ఎందుకు కేసు నమోదు కాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. మండల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అందుకే ఇప్పుడు బాధ్యత కేవలం గ్రామస్థులపై కాదు. గ్రామ కార్యదర్శి నుంచి పోలీసు అధికారులు, రెవిన్యూ అధికారుల వరకు.. నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం “విచారణ”తో సరిపెట్టే విషయం కాదు.ఇది పరిపాలనా జవాబుదారితనానికి సంబంధించిన అంశం. చివరగా ఒక మాట.. పాడె ఒంటరిగా కదలడం సమాజపు అవమానం అయితే.. పాలన ఆలస్యంగా కదలడం జిల్లా అధికార యంత్రాంగానికి అవమానం. ఇంకోసారి వార్త వైరల్ అయ్యే వరకు అధికారులు ఎదురుచూడకూడదు. లేకపోతే.. ఈ మౌనం, ఈ నిర్లక్ష్యం… రేపు ఇంకో పాడెను కూడా ఒంటరిగా నడిపిస్తుంది.