
.జనం న్యూస్ ఫిబ్రవరి 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
వివేకానంద నగర్ డివిజన్లోని రామకృష్ణ వీధి, సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న ఘటన నాలుగు రోజుల పాటు స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అపార్ట్మెంట్లో నివసిస్తున్న శైలజ మృతదేహం నాలుగు రోజులుగా అక్కడే ఉండటం పరిసరాల్లో కలకలం రేపింది. ఈ విషయాన్ని అపార్ట్మెంట్ వాసి హోటల్ రాజు, అసోసియేషన్ అధ్యక్షుడు జై పురేందర్ రెడ్డికి ఆదివారం ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తీవ్రతను గ్రహించిన అధ్యక్షుడు వెంటనే పోలీసు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, అలాగే మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు.సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో విస్తృత చర్చలు జరిగాయి. పరిస్థితిని అర్థం చేసుకుని, కుటుంబ సభ్యులను ఓపికతో ఒప్పించి చివరికి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్లోని కైకలూరు ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్న ఈ వ్యవహారాన్ని పోలీసులు, మీడియా ప్రతినిధులు, స్థానిక నాయకులు సమన్వయంతో పరిష్కరించడం విశేషం.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ, “రామకృష్ణ వీధి ప్రజలే మా బలం. కాలనీలో ఎలాంటి సమస్య వచ్చినా కమిటీ సభ్యులతో కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటాం” అని తెలిపారు. తాను ఎల్లప్పుడూ కాలనీ సేవకుడిగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడంలో సహకరించిన పోలీసు అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా ప్రతినిధులకు అధ్యక్షుడు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించవచ్చని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. ప్రజలు – కమిటీ – పోలీసులు పరస్పర సహకారంతో ముందుకు సాగితే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని వివేకానంద నగర్ మరోసారి నిరూపించింది.
