
జనం న్యూస్ 20 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ముందుగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు, ఇప్పటివరకు నమోదైన కేసుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతంగా విచారణ పూర్తి చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ అధికారి మరియు సిబ్బంది పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ఆస్తి నేరాలు వంటి అంశాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించే దిశగా పని చేయాలన్నారు.అలాగే ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలని, నేరస్తులపై మాత్రం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో పని చేస్తూ, ప్రజల విశ్వాసం పొందే విధంగా పోలీస్ వ్యవస్థ ముందుకు సాగాలని తెలిపారు.గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీస్ యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను అభినందించారు. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధత, క్రమశిక్షణతో టీమ్ వర్క్‌తో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.చివరగా ప్రతి పోలీస్ అధికారి తన బాధ్యతను గుర్తించి, ప్రజల భద్రతే లక్ష్యంగా పని చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడవద్దని జిల్లా ఎస్పీ సూచించారు.ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్,పరిగి డీఎస్పీ శ్రీనివాస్, DCRB డీఎస్పీ జానయ్య, ఏ.ఆర్ డీఎస్పీ వీరేష్, సీఐ లు, RI లు, ఎస్.ఐ లు, RSI లు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.