
జనం న్యూస్ ఫిబ్రవరి 20, వికారాబాద్ జిల్లా
పూడూరు మండలంలోని మంచిన పల్లి రైతు వేదికలో ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వికారాబాద్ వారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ వారి ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై మంచనపల్లి గ్రామ రైతు వేదిక లో అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.ఈకార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైతు విజ్ఞాణ కేంద్రం శాస్త్రవేత్త బి. రాజా మధు శేఖర్ మాట్లాడుతూ, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుకు తేలికపాటి నేలలు ఎంతో అనుకూలమని తెలిపారు. సాధారణ పత్తి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, అధిక సాంద్రతలో యాంత్రికరణ పద్ధతిలో పత్తి విత్తుకోవచ్చని చెప్పారు. దీని వలన విత్తనాలు సరైన లోతులో పడటం ద్వారా మొలక శాతం మెరుగు పడుతుందని, అలాగే వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 90 × 15 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవచ్చని వివరించారు.
అలాగే అధిక సాంద్రత పత్తిలో చేపట్టాల్సిన కలుపు యాజమాన్యం, పెరుగుదల నియంత్రణ మందులు, ఎరువుల మోతాదు మరియు నీటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. అధిక సాంద్రత పద్ధతిలో పంట కాలం తక్కువ సమయంలో పూర్తవుతుందని, తద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి. రాజేశ్వర్ రెడ్డి అధిక సాంద్రత పత్తిలో ఆశించే వేరు కుళ్ళు తెగులు, ఎండు తెగులు, తలమాడు తెగులు అలాగే వివిధ రకాల ఆకుమచ్చ తెగుళ్ల లక్షణాలు మరియు వాటి యాజమాన్య చర్యలను రైతులకు వివరించారు. పత్తిలోవినియోగించే లింగాకర్షణ బుట్టల గురించి మరియు వాటిని పొలాల్లో ఎలా అమర్చుకోవాలో కూడాఅవగాహన కల్పించారు. అదేవిధంగా అధిక సాంద్రత పత్తికి అనువైన రకాలు మరియు వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేశారు.తదుపరి పరిగి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ కుమారి మాట్లాడుతూ, రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు.రైతులకు పంటల సాగులో మేలైన రకాలను సూచించాలని తెలిపారు. అలాగే రైతులు సాగు చేసే పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి చేత పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పరిగి శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ శాస్త్రవేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలి అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాఘవేందర్ , శివరాం రెడ్డి, మరియు కిష్టయ్య, పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,మహిపాల్ ,రాజ్ కుమార్, శివ మరియు యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్, కేశవ కృష్ణ, కీర్తన రెడ్డి పాల్గొన్నారు.