
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఫిబ్రవరి 22: 02. 2026
సర్వచరాచర జగత్తును నడిపిస్తున్న అతీంద్రియమైన శక్తిని తెలుసుకోవడానికి హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుందని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ విభిషణ్ ప్రభుజీ వ్యాఖ్యానించారు. భగవంతుని గురించి కనుగొనడం మానేసి భగవంతుని గురించి తెలుసుకోవాలని సూచించారు. ఆదివారం స్థానిక పోచమ్మ ఆలయ ప్రాంగణంలో హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 195 వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. ప్రతినిత్యం హరినామ సంకీర్తన చేయడం, నిత్య ఆరాధన, భోగ సమర్పణ సద్భక్త గుణగణాలు కలిగి ఉండడం భగవంతునికి దగ్గరగా చేస్తాయన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత రెండవ అధ్యాయం లోని శ్లోకాలను ఊటంకిస్తూ పలు ఉపమానాలను వివరించారు. అంతకుముందు రానున్న హోళీ పండుగను దృష్టిలో పెట్టుకొని ముందస్తు హోళీ వేడుకలను సంకీర్తన బృందం ఘనంగా జరుపుకోంది. ఒకరిపై ఒకరు పుష్పాలను వెదజల్లుతూ హోళీ సంబరాలను వైభవంగా జరుపుకొన్నారు. హోళీ వేడుకలకు సంబంధించి బృందావన్, బరసానా లో జరిగే పాటలను పాడుతూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా గోప గోపికలు, రాధాకృష్ణుల రాసలీలలు,నంద యశోదా అల్లరి కీర్తనలు భక్తులను మంత్ర ముగ్దలను చేశాయి. తన్మయత్వం చెందిన భక్తులు ఆనందంతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నరసింహ ఆరతి ముగించి వివాహ వార్షికోత్సవాలు, జన్మదినోత్సవాలు జరుపుకొంటున్న భక్తులకు శుభాశీస్సులు అందజేశారు.
