
15 పతకాలు స్వాధీనం
విజేతలను అభినందించిన ఎస్పీ స్నేహ మెహ్రా,IPS.
జనం న్యూస్ 23 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
ఇటీవల సైబరాబాద్ వేదికగా నిర్వహించిన '4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్-2026' లో చార్మినార్ జోన్ తరపున పాల్గొని, అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడా పోటీల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొని మొత్తం 15 పతకాలను (1 గోల్డ్, 7 సిల్వర్, 7 బ్రాంజ్) సాధించి జిల్లా ప్రతిష్టను రాష్ట్ర స్థాయిలో చాటారు.
ముఖ్యంగా, అథ్లెటిక్స్ విభాగంలో కె. స్వాతి హైజంప్‌లో బంగారు పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వెండి పతకాలు సాధించిన వారిలో బాడ్మింటన్ డబుల్స్‌లోdcrb సిఐపి నవీన్ కుమార్, వెయిట్ లిఫ్టింగ్ (60Kg)లో కె. స్వాతి, ఆర్మ్ రెస్లింగ్ (100Kg)లో బి. నర్సింహులు, ఆర్మ్ రెస్లింగ్ (85Kg)లో మహేందర్, ఆర్మ్ రెస్లింగ్ (60Kg) మరియు టేక్వాండో (60Kg) విభాగాల్లో శ్రీనివాస్, బాక్సింగ్ (65Kg)లో రెహమతుల్లాలు ఉన్నారు. అలాగే, కాంస్య పతక విజేతలలో ఆర్మ్ రెస్లింగ్ (65Kg)లో బి. కావ్య, ఆర్మ్ రెస్లింగ్ (55Kg)లో స్వాతి, వాటర్ స్పోర్ట్స్ (కనోయింగ్ 200 మీటర్లు)లో మన్సూర్, స్విమ్మింగ్ (100 మీటర్లు)లో రవీందర్, హ్యామర్ త్రోలో జై ఆనంద్, బాక్సింగ్ (70Kg)లో ప్రకాష్ మరియు మహిళల ఖో-ఖో జట్టు (3వ స్థానం) నిలిచారు.
ఈ సందర్భంగా విజేతలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ "నిరంతరం శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉంటూ, విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, క్రీడల పట్ల మక్కువతో సమయం కేటాయించి పతకాలు సాధించడం నిజంగా గర్వకారణం. ఒక పోలీస్ అధికారికి వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. క్రీడలు ఈ రెండింటిని పెంపొందించడమే కాకుండా మనలో టీమ్ వర్క్ (జట్టు స్ఫూర్తి) మరియు క్రమశిక్షణను నింపుతాయి. గెలుపోటముల కంటే క్రీడల్లో పాల్గొనడం, మన ప్రతిభను నిరూపించుకోవడం ముఖ్యం. ఈ గెలుపు కేవలం మీకు మాత్రమే కాదు, చార్మినార్ జోన్ మరియు వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ మొత్తానికి గర్వకారణం" అని, మీరు సాధించిన ఈ పతకాలు తోటి సిబ్బందికి పెద్ద స్ఫూర్తినిస్తాయి. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు జిల్లా పోలీస్ శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని, జాతీయ స్థాయిలో కూడా మన జిల్లా పేరు మారుమోగేలా మీరు కృషి చేయాలని" ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆర్. ఐ డేవిడ్ విజయ్ కుమార్,డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
