
స్థానిక పల్లంకుర్రు గ్రామ పరిధిలోని సాపేవారిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థిని విద్యార్థులకు గ్రామ వాసి, పాఠశాల పూర్వ విద్యార్థి అయిన జంగా పురుషోత్తం రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జంగా పురుషోత్తం గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతలు అలవర్చుకొని, మెరుగైన విజ్ఞానంతో ఉన్నత విద్య కొనసాగించాలని తద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆ దిశగా మీరు పయనించాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ. సుధ మాట్లాడుతూ సొంతఊరిలో తను చదువుకున్న పాఠశాలలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న పురుషోత్తం గారిని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.
అదేవిధంగా పాఠశాల మొదటి సహోపాధ్యాయులు ఎన్.ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష కిట్లను అందజేయడంతో పాటు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులు కూడా అందిస్తున్నారని, వాటిని అందిపిచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ పోటీతో చదవాలని విద్యార్థులకు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్న పురుషోత్తం గారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గెడ్డం ప్రదీప్, ఎం.శ్రీనివాసరాజు, వై.కృష్ణ, బి. దుర్గాభవాని, ముంతాజ్ బేగం, కొల్లి బేబీ, చెల్లి దీపిక, కె. శ్రీనివాసరావు, పురుషోత్తం గారి బంధువులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
