
జనం న్యూస్ మార్చి 6, వికారాబాద్ జిల్లా
పరిగి మండలంలోని మాదారం గ్రామంలో డ్రగ్స్ రహిత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన EAGLE టీం గౌరవ డైరెక్టర్ సందీప్ శాండిల్య, మరియు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా .
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, 5వ థీమ్ 'పిల్లల భద్రత - డ్రగ్స్ కు అడ్డుకట్ట' పై పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదారం గ్రామంలో ఈ రోజు భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర EAGLE టీం గౌరవ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా గౌరవ అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తొలుత సరదాగా ప్రారంభమయ్యే చిన్న చిన్న అలవాట్లు కాలక్రమేణా ప్రాణాంతకమైన వ్యసనాలుగా మారి, వ్యక్తిగత జీవితంతో పాటు సమాజాన్ని కూడా సర్వనాశనం చేస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా పసిపిల్లలను డ్రగ్స్ ఊబిలోకి దించడం అనేది క్షమించరాని నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులు చెడు స్నేహాలకు, అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో కూడిన ఉత్తమ అలవాట్లను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదని, ఇది ఒక 'ఆర్గనైజ్డ్ క్రైమ్' (వ్యవస్థీకృత నేరం) అని అభివర్ణించారు. మన రాష్ట్ర అభివృద్ధిని, దేశ భవిష్యత్తును దెబ్బతీయడానికి శత్రువుల చేతిలో డ్రగ్స్ ఒక మారణాయుధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో డ్రగ్స్ సరఫరా లేదా వాడకం గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.అదేవిధంగా, విద్యార్థుల భద్రతపై దృష్టి సారిస్తూ వారికి 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' పై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే తమకు ఎదురయ్యే అసౌకర్యాలను గుర్తించి, ధైర్యంగా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలే తప్ప పక్కదారి పట్టకూడదని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక మరియు ఆర్థిక నష్టాలను వివరించారు.ఈ కార్యక్రమంలో EAGLE టీం అదనపు ఎస్పీ కృష్ణ మూర్తి, జిల్లా అదనపు ఎస్పీ B. రాములు నాయక్, పరిగి DSP శ్రీనివాస్, excise అధికారులు, ఈగిల్ టీం సిబ్బంది,మాదారం గ్రామం సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజన సంఘాలు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.