
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 18 సెల్ 9550978955
త్వరలోనే నియోజకవర్గంలో 3,500 కొత్త దివ్యాంగ పింఛన్ల మంజూరు.
దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో కలిసి భోజనం చేసిన ప్రత్తిపాటి.
వైసీపీ దుష్ప్రచారాన్ని దివ్యాంగులే తిప్పికొట్టాలి. చిలకలూరిపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థిక స్థిరత్వానికి, ఆత్మాభిమానానికి కొండంత అండగా నిలిచిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కూటమి నాయకులతో కలిసి ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, సమాజ ప్రగతిలో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం దివ్యాంగులను కేవలం ఓటు బ్యాంకుగా చూసి అవమానించిందని, కానీ నేడు చంద్రబాబు నాయుడు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పింఛన్లను రెండింతలు పెంచడమే కాకుండా, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారని కొనియాడారు. ఉచిత ప్రయాణం: 40 శాతం వైకల్యమున్న ప్రతి దివ్యాంగుడికి మరియు వారి సహాయకులకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మందికి ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. 21 రకాల వైకల్యాలకు అండ: గతంలో లేని విధంగా 21 రకాల వైకల్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి ప్రభుత్వం అండగా నిలిచింది.
కొత్త పింఛన్లు: త్వరలోనే నియోజకవర్గంలో అదనంగా 3,500 మందికి కొత్త దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.అధికారులకు సూచన: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే దివ్యాంగుల పట్ల అధికారులు మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో సంఘీభావం: పథక ప్రారంభం అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా దివ్యాంగులకు ఆర్టీసీ టిక్కెట్లు అందజేసి, వారితో కలిసి బస్సులో ప్రయాణించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో వారితో కలిసి సామూహిక భోజనం చేసి, వారిలో ధైర్యాన్ని నింపారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని దివ్యాంగులే సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, బీజేపీ నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మరియు మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.