
జనం న్యూస్ 19 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ఎస్సీల యాక్షన్ ప్లాన్ అమలులో బ్యాంకుల సహకారం కీలకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.జోగులాంబ గద్వాల జిల్లాలో షెడ్యూల్డ్ కాస్ట్స్ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలు పై జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం తన ఛాంబర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ స్కీమ్ (ఇ యస్ యస్ ) పై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది పలు పథకాల ద్వారా వివిధ యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో టూ వీలర్లు, త్రీ వీలర్లు, సోలార్ పంప్ సెట్లు వంటి యూనిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు 90% వరకు సబ్సిడీతో బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు.ప్రస్తుతం ఓబిఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, మార్చి 24 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయన్నారు. అనంతరం మార్చి 26 నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో అర్హత, సిబిల్ స్కోర్, బ్యాంక్ అనుమతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.బ్యాంకుల సహకారం ఈ పథకం విజయానికి కీలకమని, ఎంపికైన లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేసి, యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు విషయంలో స్విగ్గీ, జొమాటో, ఉబెర్ వంటి గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని తెలిపారు.సోలార్ పంప్ సెట్ల విషయంలో కనీసం 2 ఎకరాల భూమి కలిగి ఉండాలని, పట్టాదారు పాస్బుక్ మరియు బోర్వెల్ ధృవీకరణ అవసరమని తెలిపారు.లబ్ధిదారుల ఎంపికలో గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రయోజనాలు పొందని వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.మహిళలకు 33% రిజర్వేషన్లు, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు
అమలు చేయాలని తెలిపారు.అలాగే ఏప్రిల్ 7 లోపు అన్ని శాంక్షన్ ప్రక్రియలు పూర్తి చేసి, ఏప్రిల్ 16 నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత, సమన్వయం, వేగవంతమైన చర్యలు అవసరమని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, తదితరులు పాల్గొన్నారు.జారీ చేయువారు:- డిపిఆర్ఓ /జోగులాంబ గద్వాల జిల్లా.