
జనం న్యూస్ | మార్చి 20 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పరిధిలో నివాస స్థలాల కోసం ఎదురుచూస్తున్న బుడగ జంగాల కుటుంబాల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. అర్హులైన ఈ కుటుంబాలకు తగిన నివాస స్థలాలను ఏర్పాటు చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.స్థానికుల వివరాల ప్రకారం, కైతలాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 995లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఈ కుటుంబాలు గతంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవి. అయితే సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంతో, అక్కడి నివాసులను ఖాళీ చేయించగా వారు నిరాశ్రయులుగా మారిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో శుక్రవారం బాధిత కుటుంబాలు కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గా పార్టీ కార్యాలయంలో బండి రమేష్‌ను కలిసి తమ గోడును వివరించాయి. వారి సమస్యను ఆత్మీయంగా వినిన రమేష్ వెంటనే స్పందించి, స్థానిక ఎమ్మార్వో స్వామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అర్హులైన ఈ కుటుంబాలకు ప్రభుత్వ భూమి ఎక్కడైనా అందుబాటులో ఉంటే గుర్తించి నివాస స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా బుడగ జంగాల కుటుంబాలకు న్యాయం జరిగేలా తాను కట్టుబడి ఉన్నానని బండి రమేష్ హామీ ఇచ్చారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.
