
జనం న్యూస్ | మార్చి 24 | తెలంగాణ స్టేట్ ఇంచార్జి: శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి పరిధిలోని పాపరాయుడు నగర్ చౌరస్తా వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది ఇది కేవలం తాత్కాలిక రద్దీ సమస్య కాకుండా, ప్రణాళికా లోపాల వల్ల ఏర్పడిన స్థిర సమస్యగా స్పష్టమవు తోంది. ఆల్విన్ కాలనీ సర్కిల్లోని వెంకటేశ్వర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ చౌరస్తా, జగద్గిరిగుట్ట, ఐడిపిఎల్, గాంధీనగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాలను పాపిరెడ్డి నగర్, అస్బస్టస్ కాలనీ మార్గంగా కూకట్పల్లి ప్రధాన కేంద్రంతో అనుసంధానించే కీలక రహదారి. దీనివల్ల ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులు భారీగా ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు.ఫలితంగా, ట్రాఫిక్ తీవ్రత అధికమై వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. అంతేకాకుండా, చౌరస్తాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై స్పందించిన కాలనీ మరియు బస్తీ నేతలు, ఇది కేవలం రాకపోకల ఇబ్బందే కాకుండా ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, రహదారి విస్తరణ, ట్రాఫిక్ పోలీసుల నియామకం వంటి చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, స్థల పరిశీలన జరిపి, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాపరాయుడు నగర్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి, పాపిరెడ్డి నగర్ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ రావు, శ్రీనివాస్ రావు, ఎం. ప్రసాద్, ఎం. దేవేందర్ రావు, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.