
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS.
జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా
ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, 2026 మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ప్రజలకు ఒక గొప్ప అవకాశమని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివిధ కేసులను పరస్పర రాజీ ద్వారా తక్కువ సమయంలో పరిష్కరించుకునే వీలు ఈ వేదిక ద్వారా లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా చిన్న చిన్న వివాదాలు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు మరియు కుటుంబ సమస్యలు వంటి అనేక అంశాలను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. దీని ద్వారా ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గి, సమయం మరియు వ్యయం రెండూ ఆదా అవుతాయని వివరించారు. లోక్ అదాలత్ అనేది శాంతియుత, రాజీ మార్గంలో జరిగే పరిష్కార ప్రక్రియ కావడంతో, ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ విధానం ద్వారా కోర్టు కేసులు త్వరగా ముగిసి, ప్రజల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆమె ఆకాంక్షించారు. న్యాయం త్వరగా అందించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, కావున పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ,కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని తమ సమస్యలకు శాంతియుత పరిష్కారం పొందాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.