
పర్యావరణ పన్ను వసూళ్లు సరి- మౌలిక సదుపాయాల కల్పన ఏది?
జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ అందాలను వీక్షించడానికి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో అటవీ శాఖ చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తూ పర్యాటకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. హైదరాబాదు నుంచి నాగార్జునసాగర్ వీక్షించడానికి వచ్చే పర్యాటకులకు, వాహనదారులకు నాగార్జునసాగర్ ఎంట్రన్స్ బెట్టేల తండా వద్ద ఒక చెక్ పోస్ట్, మిర్యాలగూడ, నల్లగొండ నుంచి వచ్చే పర్యాటకులకు, వాహనదారులకు సమ్మక్క- సారక్క ఎంట్రెన్స్ వద్ద ఒక చెక్ పోస్ట్ ఏర్పాటుచేసి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పన్ను వసూలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం కొత్త వంతెన వద్ద ఆంధ్ర అటవీ శాఖ అధికారుల చెక్ పోస్ట్ దర్శనమిస్తుంది, ఎత్తిపోతల అందాలను వీక్షించడానికి వెళ్తే అక్కడ మరొక అటవీ శాఖ చెక్ పోస్ట్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంది. సుదీర్ఘ అటవీ మార్గాల్లో వసూలు చేయాల్సిన ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ ను కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోని మూడు చోట్ల ఫీజు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు, పర్యాటకులు వాపోతున్నారు.అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద అధికారులకు పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పన పై లేకపోవడం శోచనీయం,అటవీ మార్గాల నుంచి ప్రయాణించే వాహనాల నుండి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో వసూలు చేస్తున్న నిధులు ఏమవుతున్నాయనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ మరియు ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్దేశించిన ఈ పన్ను ఆదాయం, క్షేత్రస్థాయిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోవడం లేదని సామాజిక కార్యకర్తలు మరియు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద కనీస సౌకర్యాలైన పరిశుభ్రమైన తాగునీరు, మహిళ ప్రయాణికులకు పారిశుద్ధ్య సౌకర్యాలు (పబ్లిక్ టాయిలెట్స్) అందుబాటులో లేవు. పర్యావరణ పన్నుల ద్వారా ఏటా భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ అటవీ ప్రాంతాల్లో వ్యర్ధాల నిర్వహణ, పర్యావరణ అనుకూల విశ్రాంతి కేంద్రాల ఏర్పాటులో అటవీ శాఖ విఫలమవుతుంది. అడవిలో ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్ధాలు పారేయకుండా ఉండేందుకు ప్రతి చెక్ పోస్ట్ వద్ద వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ ఉండాలి, సేకరించిన వ్యర్ధాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేసే వ్యవస్థను ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో వసూలు అయినా డబ్బుతో నిర్మించాలి.ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి అటవీ శాఖ చెక్ పోస్ట్ ల వద్ద వసూలు అవుతున్న నిధులను తిరిగి అదే ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు , పర్యావరణ అభివృద్ధికి వెచ్చించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి చెక్ పోస్ట్ వద్ద వసూలు అయిన నిధులు మరియు ఖర్చు చేసిన నిధుల వివరాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.పర్యావరణ పన్ను అనేది కేవలం ప్రవేశ రుసుము లా మిగిలిపోకుండా ప్రయాణికుడు పన్ను చెల్లిస్తున్నప్పుడు అతనికి నాణ్యమైన సేవలు అందాలి అప్పుడే పనులు చెల్లించే వారికి సంతృప్తి కలుగుతుంది అడవి పై బాధ్యత పెరుగుతుంది. పర్యావరణం పేరుతో కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా, బాధ్యతాయుతమైన సేవలను అందించినప్పుడే ఈ పన్ను ఉద్దేశం నెరవేరుతుందని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.