
జనంన్యూస్.నిజామాబాద్, మార్చి 30.శ్రీనివాస్ పటేల్.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 02వ తేదీన గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీలలో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులకు పలు అంశాలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లతో సమావేశమై తగు సూచనలు చేయాలన్నారు. గ్రామ సభలు నిర్వహించే ప్రదేశాలలో తగిన నీడ, తాగునీరు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 7.30 నుండి 10.30 గంటల లోపు సభలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సభలలో అవగాహన కల్పించడంతో పాటు, ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారులతో వారి అనుభవాలను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా గ్రామ/వార్డు సభల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఇదిలాఉండగా, పదవ తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లకు కలెక్టర్ సూచించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
