
జనం న్యూస్ 01 ఏప్రిల్ 2026. జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో హిస్టరీ షీట్స్ అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నైట్ బీట్ మరియు పెట్రోలింగ్ విధులలో మరింత సమగ్రవంతంగా నిర్వహించేలా ప్రణాళికలు చేసుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలి అని తెలిపారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అందించాలన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని, ఎస్.హెచ్.ఓ. లు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ముందస్తు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు తరచూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సైబర్ టీమ్ వారు జిల్లాలో సైబర్ క్రైమ్ చేదనలో గల పురోగతిని జిల్లా ఎస్పీ కి వివరించారు. చట్ట ఉల్లంఘనల పై కఠిన చర్యలు తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ వర్కను మరింత వేగవంతం చేయాలి వంటి అంశాలపై ఎస్పీ సూచనలు చేశారు.అంతేకాకుండా జిల్లాలోని సిబ్బంది వారి సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎస్ఐ లు ప్రాపర్ గా ఎండార్స్ చేసి పంపాలని ఎస్పీ జిల్లా ఎస్సై, సీఐ లను ఆదేశించారు.జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో విశేషంగా కృషి చేసిన కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.రాబోయే హనుమాన్ జయంతి పండుగతో పాటు గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం కలిగి పండుగలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టి. శ్రీను, వి. ప్రదీప్ కుమార్, టాటా బాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అలాగే అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, జిల్లా కార్యాలయ ఎస్సైలు పాల్గొన్నారు.