
నందికొండ మున్సిపాలిటీలో ప్రజా పాలన -పథకాలపై అవగాహన సదస్సులు
స్థానిక సమస్యలపై గళం విప్పిన ప్రజలు
జనం న్యూస్ -ఏప్రిల్ 2- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వార్డుల ప్రజలు తమ ప్రాంతాలలో నెలకొన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్లారు. నందికొండ మున్సిపాలిటీ వాసుల ప్రధాన సమస్య అయిన కోతులు ,వీధి కుక్కలు డ్రైనేజీ లోపాలు, రోడ్ల దుస్థితి వంటి అంశాలతో పాటు వైట్ రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ,వితంతు పెన్షన్ల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులకు మొరపెట్టుకున్నారు. స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అధికారులు, వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, స్థానిక వార్డు సభ్యులు పాల్గొన్నారు.