
జనం న్యూస్, ఏప్రిల్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పరిధిలోని కెపిహెచ్బీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన విరాట్ శోభాయాత్రలో సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. రామ్ సేన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్ నుంచి నిర్వహించిన ఈ శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ సభ్యులు “రామ్ సేనతో మేము సైతం” అనే నినాదంతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా శోభాయాత్రకు హాజరైన భక్తులకు సుమారు వెయ్యిమందికి పైగా చల్లటి మజ్జిగ, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాషా మరియు టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ సత్తార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కులమత భేదాలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు. డీసీపీ రితీరాజ్, కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కార్యక్రమ నిర్వాహకులను, పాల్గొన్న వారిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి సేవ చేయడం తమకు గర్వకారణమని తెలిపారు. ప్రతి ఒక్క హిందూ సోదరునిని ఆప్యాయంగా పలకరించి, పరస్పర సౌహార్దాన్ని పెంపొందించేందుకు కృషి చేశామని పేర్కొన్నారు. భాషా, షేక్ సత్తార్ మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద కాలనీలలో ఒకటైన కెపిహెచ్బీ కాలనీలో అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు.ఈ శోభాయాత్రలో ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్నతో పాటు మహబూబ్ (కచ్చిన్), కరీం భాయ్, నజీర్ భాయ్, గంగన్న, చంద్ర, రాము, రెహ్మాన్, ప్రవీణ్, షబ్బీర్, శివ, శ్యాంసుందర్, క్రాంతికుమార్, బాలకృష్ణ, సునీల్, మహమ్మద్ హుస్సేన్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు.
