
జనం న్యూస్ 5 ఏప్రిల్ ఘట్కేసర్ ప్రతినిధి
పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు నడుం బిగించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్, 8వ డివిజన్ పోచారంలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధిలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆదివారం శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, మేడ్చల్ జిల్లా బిఎస్పీ అధ్యక్షుడు వల్లమల్ల ప్రవీణ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇటికల కృష్ణ రెడ్డి, పోచారం డివిజన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బద్రి హేమంత్, మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గోంగోళ్ళ బాలేష్, మరియు మోత్కూర్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ..గత నాలుగేళ్లుగా కాలనీలో సరైన పార్కు సౌకర్యం లేక పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ ఇబ్బంది పడుతున్నారని, ఈ ప్లాంటేషన్ ద్వారా పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని బతుకమ్మ, దసరా వంటి పండుగలకు వేదికగా మారుస్తామని, ఇందుకు దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దాతలు సైతం కాలనీ అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ముఖ్య అతిథులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ మహిళలు, పిల్లలు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
