
పేకాట, ఇసుక మాఫియా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నోముల భగత్
జనం న్యూస్- ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెచ్చు మీరుతున్న అసాంఘిక కార్యకలాపాలు, ఇసుక మాఫియా పై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర స్థాయిలోఆరోపణలు చేశారు. నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నోముల భగత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యధా రాజా తథా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక దందా సాగుతుందని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పేకాట క్లబ్బులు యదేచ్చగా నడుస్తున్న అధికార యంత్రాంగం వీటిని అరికట్టడంలో విఫలమయ్యారని నోముల భగత్ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతోనే ఈ జూద కేంద్రాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.పేకాట స్థావరాలే స్థానిక నాయకులకు ఆదాయ వనరుగా మారిందని, నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, పేకాట, బెట్టింగ్ నడుస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అధికార పక్షం అండ లేకుండా ఇంత బహిరంగంగా అక్రమాలు జరగడం అసాధ్యమని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలను అరికట్టకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల తరఫున నిలబడి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారని నోముల భగత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనుముల మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చిన్ను సుందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రమేష్ జి, 2వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ గని, 7వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ముక్సుద్, 9వ వార్డు ఇన్చార్జి బత్తుల శేఖర్ బాబు, 10వ వార్డు ఇన్చార్జి కోడ విజయ్, ఆదాసు విక్రం, అర్జున్ నాయక్, శివ, మహేష్ నాయక్, మన్సూర్, నజీర్, రవి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.