
జనంన్యూస్- ఏప్రిల్ 7- నాగార్జునసాగర్ టౌన్-
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మంగళవారం నాగార్జునసాగర్ లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 5 కె రన్ నిర్వహించారు. ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డి. వి భాస్కరరావు ఆధ్వర్యంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, ప్రతాప్ నాయుడులతో కలసి ఎస్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, జోన్ డిఐజి ఆర్ మాధవరావు ఆదేశాల మేరకు నిర్వహించిన 5 కె రన్ కార్యక్రమాన్ని జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నుండి 420 గ్యాలరీ ముఖ ద్వారం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ 99 ప్లాన్ లో భాగంగా వారంలో ప్రతి మంగళవారం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. దీనిలో భాగంగానే స్వచ్ భారత్, రక్త దాన శిబిరం, అనాధ పిల్లలకు, పేదవారికి దుస్తులు, ఆహార పదార్థాల అందజేత లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎస్ పి ఎఫ్ విభాగాన్ని ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక సాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ లోని జెన్కో ఎస్ పి ఎఫ్ విభాగం, సాగర్ ప్రాజెక్ట్ భద్రత విభాగం, మిర్యాలగూడకు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ చెస్ట్ విభాగాలకు చెందిన 33 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.