
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్ మండలం నాగ్లావ్ గ్రామానికి చెందిన అశోక్ (24) మద్నూర్ మండల కేంద్రంలో కూలీ పనులు ముగించుకుని ఒకే బైక్పై ఇంటికి బయలుదేరారు. జాతీయ రహదారి 161 మేనూర్ సమీపంలోని లచ్చన్ గేట్ ప్రధాన రహదారిపై ఆపి ఉన్న లారీని ఢీకొట్టడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నాగు, అశోక్లను స్థానికులు బస్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నాగు, సతీష్ ఉన్నారు. రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న వారు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి కోసం కష్టపడిన చేతులు ఇలా నిష్ఫలంగా మారడంతో వారి కుటుంబాల రోదనలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.