
ఇళ్లపై పొంచి ఉన్న పెను ప్రమాదం
జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 4వ వార్డు హాస్పటల్ వెనుక గేటు వద్ద ఉన్న ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం బారిన పడతాయో అని నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాల మధ్య సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో ఇళ్లకు అతి సమీపంలో, కొన్నిచోట్ల కేవలం మూడు నాలుగు అడుగుల ఎత్తులో విద్యుత్ తీగలు వెళుతున్నాయి. గాలి వాన వచ్చినప్పుడు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గోడలు తడిసినప్పుడు తేమ ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగే అవకాశం ఉంటుందని, ఆడుకునే చిన్నపిల్లలు తెలియక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని, గాలిపటాల దారాల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని , ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ స్తంభాలకు తీగలకు నివాస గృహాలకు మధ్య దూరం ఉండే విధంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ అధికారులు ప్రమాదం జరిగాక స్పందించడం కంటే, జరగకముందే అడ్డుకోవడం మిన్న అని స్థానికులు గుర్తు చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ తీగలను నివాస ప్రాంతాలకు దూరంగా మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు.
