
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 11
మహాత్మ జ్యోతిరావు పూలే 199 జన్మదిన వేడుకలు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు మాట్లాడుతూ,సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేనా పిష్వా పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలే గా మార్పు చెందింది. జ్యోతిరావు కి సంవత్సరం వయసు రాకుండానే తల్లి తనువు చాలించింది. ఏడు సంవత్సరాల వయసులో పూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు తర్వాత చదువు మానేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.అతి తక్కువ కాలం పాఠశాల వెళ్లినప్పటికీ పూలే పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు లాంతరు వెలుతులో చదువుకునేవాడు. జ్యోతిరావుకు చదువు పట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్ ఇంటి పక్కనే ఉన్న ఒక క్రైస్తవ పెద్దమనిషి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో పూలే పరిచయం జీవితకాలం స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు పూలే. జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ,జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనను ప్రభావితం చేసింది. 13 ఏళ్ల ప్రయాణంలో జ్యోతిరావు కి తొమ్మిది సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఆయన తన కుటుంబ వ్యాపారమైన పూల వ్యాపారం ప్రారంభించాడు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో పూలే బీసీ మాలి కుటుంబానికి చెందిన వాడవడం వల్ల కుల వివక్ష గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. సమాజంలో అగ్రకులాల వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడాన్ని, ఆయన అభ్యంతరం తెలిపాడు.
సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించాడు. అందువల్ల స్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరాని వారి కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాలేదు. చివరకు జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851- 52 లో మరో రెండు పాఠశాలలు స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని పూలే విమర్శించేవాడు. ఆనాడు సమాజంలో బాల్యవివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోని మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాలు గురించి పూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించేవాడు. 1864లో "బాల హత్య ప్రతిబంధక్ గృహ" స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజాన్ని పూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. 1891 లో ప్రచురించిన సార్వజనిక్ ధర్మ పుస్తక్ మత, సాంఘిక విషయాలపై పూలే అభిప్రాయాలను తెలియజేస్తుంది. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సంఘటనలు ఆయన మనసును కలిచివేసి సమాజంలో అందరూ సమానమేని, ఎన్నో పోరాటాలు చేసి చాలావరకు ప్రజలను చైతన్యపరిచాడు. అంటరాని వారికోసం అణగారిన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నిస్వార్థ నాయకుడిగా నిలిచారు. అందుకే ఆయనను మహాత్మ జ్యోతిరావు పూలే అని సంబోధిస్తారు. ఆ గొప్ప మనిషి 1890 నవంబర్ 28వ తేదీన పూణేలో మరణించారు. ఈ విధంగా ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు పాఠశాలలోని విద్యార్థులకు ఆయన త్యాగాల గురించి,ఆయన చేసిన సేవలు గురించి తెలియజేసి మీరు కూడా సమాజానికి ఎంతో కొంత అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఎం అనూష మరియు విద్యార్థులు పాల్గొన్నారు.