
జూన్ 14 వరకు 61 రోజుల పాటూ అమలు
జనం న్యూస్, ఏప్రిల్ 14,అచ్యుతాపురం :
ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నెల 15 అనగా నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా 61 రోజుల పాటూ చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సముద్రంలో చేపలు, ఇతర మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి.. అందుకే ఈ సమయంలో బోట్లు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రతి ఏటా నిషేధం అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తారు.. అలాగే వలలు స్వాధీనం చేసుకుని బోటు రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని మత్స్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులు సహకరించాలని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఈ చేపల వేట విరామ సమయంలో.. మత్స్యకారుల సేవలో పథకం కింద ఏడాదికి రూ.20వేలు అందిస్తోంది.ఈ నెల 17 నుంచి అర్హులైన మత్స్యకారుల వివరాలు సేకరించనున్నారు. అంతేకాదు ప్రభుత్వం వేటకు వెళ్లే బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ కూడా అందిస్తోంది. అలాగే రాయితీపై మత్స్యకారులకు ఇంజిన్, తెప్ప, వల కూడా అందిస్తున్నారు.మత్స్యకారులకు 40% రాయితీపై మోటార్ ఇంజిన్లు అందజేస్తున్నారు.
