
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ
జనం న్యూస్-ఏప్రిల్ 14- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిల్ కాలనీ బస్ స్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని హిల్ కాలనీ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు,
బ్రెడ్ పంపిణీ చేశారు. మాల మహానాడు టౌన్ సెక్రెటరీ యాళ్ల విజయ్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హరికృష్ణ, మాల మహానాడు టౌన్ ప్రెసిడెంట్(5 వ వార్డ్ కౌన్సిలర్) సాగర్ బాబు, మైనారిటీ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్ గని, మహారాజుల సేవా సంఘం సభ్యులు జి బద్రి లు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపారమని ముఖ్యంగా నిమ్న వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు వివక్షకు గురవుతున్న కాలంలో సమ సమాజ స్థాపన లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా పేద రోగులకు స్వల్ప సహాయంగా ఇట్టి కార్యక్రమాన్ని చేసిన యాళ్ల విజయ్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు గుంటి సూర్య కోటేశ్వరరావు, మాల మహానాడు నాగార్జునసాగర్ టౌన్ ట్రెజరర్ భూపతి రవీంద్ర, శాంసన్, జోజి, కె శాంసన్, కోరే ప్రేమ్, మహారాజుల సంఘం సభ్యులు నకులరావు, పుల్లారావు, ముస్లిం మైనారిటీ సభ్యులు నజీర్, షరీఫ్, చంటి, సువర్ణ బాబు, జంగా శ్రీను, నవకాంత్, భరత్, వాసు, కోమల్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.