
జనం న్యూస్ 15 ఏప్రిల్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రుద్రూర్ ఉపసర్పంచ్ షేక్ నిస్సార్ అన్నారు. మంగళవారం నాడు మండల కేంద్రంతో పాటు రుద్రూర్ మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ షేక్ నిస్సార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. బాబా సాహెబ్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా షేక్ నిస్సార్ పునరుద్ఘాటించారు. మండల సమీకృత సముదాయ భవనం నందు ఎంపీడీవో బాలగంగాధర్, అక్బర్ నగర్,రుద్రూర్ గ్రామాలలో రుద్రూర్ సీఐ కృష్ణ,ఎస్సై సాయన్న, బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆయా గ్రామాల సర్పంచులు, బహుజన సంఘాలు, బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.