
జనం న్యూస్ ఏప్రిల్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యవసరమనే దృష్టితో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “ఆరైవ్ ఆలైవ్” కార్యక్రమాన్ని కూకట్పల్లి పోలీసులు మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా నేడు కూకట్పల్లి పరిధిలోని జెన్సిస్ స్కూల్లో నిర్వహించిన అవగాహన సదస్సు విద్యార్థులు, యువతలో సురక్షిత ప్రయాణంపై స్పష్టమైన సందేశాన్ని అందించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్ మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలి మార్పులు, సరైన నిద్రలేమి, వేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆత్రుత వంటి కారణాల వల్లే రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రాణం అమూల్యమని, ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు నాశనం కావొచ్చని ఆయన గంభీరంగా హెచ్చరించారు.“స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం పై ఉన్న అపోహలను ఖండిస్తూ, “జుట్టు రాలిపోతుంది” అనే కారణంతో హెల్మెట్‌ను విస్మరించడం ప్రాణాలపై ఆటలాడటమేనని అన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటి రక్షణ చర్యలు కేవలం చట్టపరమైన నిబంధనలు కాకుండా ప్రాణరక్షణకు కీలకమని వివరించారు.ప్రత్యేకంగా విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ తరహా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సదస్సులో జెన్సిస్ స్కూల్ విద్యార్థులతో పాటు కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ యస్ హెచ్ ఓ మరియు, ట్రాఫిక్ యస్ హెచ్ ఓ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ట్రాఫిక్ నియమాలపై ప్రదర్శనలు, సూచనలు అందించారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రమాణం చేయడం విశేషం.
మొత్తంగా ఈ కార్యక్రమం యువతలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించేందుకు ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు.
