
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955
బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు హెచ్చరిక
బ్రోచర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
అక్షయ తృతీయ వంటి పర్వదినాల వేళ సామాజిక రుగ్మత గా మారిన బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, పల్నాడు జిల్లాను దేశంలోనే ఆదర్శవంతమైన 'బాల్య వివాహ రహిత జిల్లా'గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పిలుపునిచ్చారు. నరసరావుపేటలో నీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో 'బాల్య వివాహాలు లేని భారతదేశం లక్ష్యంగా రూపొందించిన అవగాహన బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "బాల్యం అనేది చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఉన్న సమయం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, వారి ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుంది. బాల్య వివాహాలను ప్రోత్సహించడం, జరిపించడం లేదా జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం చట్టరీత్యా నేరం. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది," అని హెచ్చరించారు. జిల్లాలో సామాజిక మార్పు కోసం పనిచేస్తున్న నీడ్స్ సంస్థ ప్రతినిధులను అభినందిస్తూ, పల్నాడు జిల్లాలోని ప్రతి పౌరుడు, అధికారులు ఈ సామాజిక యుద్ధంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. అక్షయ తృతీయ వేళ ఎక్కడైనా బాల్య వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800-102-7222 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నీడ్స్ సంస్థ డైరెక్టర్ కే.ప్రేమానందం, కోఆర్డినేటర్ రామచంద్ర,సోషల్ వర్కర్ మంద. ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొని, కలెక్టర్ మార్గనిర్దేశంలో బాల్య వివాహాల నిరోధానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.