
విద్యార్థుల పుట్టినరోజున పాఠశాలలో పండగ వాతావరణం
మానసికంగా బలపరచడమే వారి ఉద్దేశ్యం
జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని సోమేశ్వరం భవిత కేంద్రం టీచర్లు నిరూపిస్తున్నారు. మానసికంగా వారికి ఉత్తేజాన్ని కల్పిస్తూ, బోధనలో మెలకువలు పాటిస్తున్నారు. టీచింగ్, లెర్నింగ్ స్కిల్స్ తో విద్యార్థుల మనసును ఆకట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే రాయవరం మండలంలోని సోమేశ్వరం భవిత కేంద్రం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తిరగాటి వీర వేణి,పోదురి ఆదర్స్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల మనసును ఆకట్టుకుంటున్నారు. తమ పిల్లలు భవిత కేంద్రానికి వచ్చిన తర్వాత మాట్లాడడం, రాయడం, చదవడం చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్రతి మంగళవారం ప్రభుత్వానుసారం చదువుతోపాటు ఫిజియోథెరపీ అందిస్తూ విద్యార్థుల కు మరింత ఉత్తేజాన్ని అందిస్తున్నారు. పిల్లల పుట్టిన రోజులను పాఠశాలల్లో జరుపుతూ, మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నారు. తమ సొంత పిల్లల్లాగా భావించి, విద్యార్థుల పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.